”>
<\div>

Wednesday, 8 April 2015

రచయిత్రులు నాడూ.. నేడూ..

తొలి నాటి రచయిత్రులకూ, నేటి రచయిత్రులకూ తేడా ఎక్కువ ఉంది. చాలామంది రచయిత్రులు తమ పుస్తకాలను చిన్న పరిధికే పరిమితం చేస్తున్నారు. అన్ని విషయాలనూ అధ్యయనం చేసి, అన్ని కోణాలలో పరిశీలించి రచయత్రులు రచనలు చెయ్యడం అతివల అభ్యుదయానికి అసలైన మార్గం. .......................... తెలుగులో తొలి కథ ఏది అన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చును కానీ భండారు అచ్చమాంబగారి '్ధనత్రయోదశి' అత్యుత్తమ కథలలో ఒకటి అన్న విషయంలో ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. పండుగనాడు తినడానికి చిన్న బెల్లంముక్క తప్ప ఏ పిండి వంటా లేని ఇంటి ఇల్లాలు భర్తను అన్యాయార్జితం వైపుకు దారి మళ్ళకుండా ఆపుతుంది. స్ర్తి విద్య వినాశనానికి దారితీస్తుందన్న హెచ్చరికలు కోకొల్లలుగా వస్తున్న కాలం (19వ శతాబ్ది అంతం, 20వ శతాబ్ది ఆరంభం)లో అచ్చమాంబగారు కథలు వ్రాశారు. 'అబలా సచ్చరిత్ర రత్నమాల' అనే పేరుతో సబలలైన స్ర్తిల గురించి పుస్తకం రాశారు. ఈనాడైతే అటువంటి పుస్తకం రాయడం చాలా సులభం. ఇంటర్నెట్‌లో దొరకని వివరముండదు. నాడు అలా కాదు. ఉత్తరం రాయాలి, ప్రత్యుత్తరానికై వేచిచూడాలి, జవాబు రాకుంటే మరోచోట ప్రయత్నించాలి. చాలా కష్టపడి వివరాలు సేకరించి రచించిన పుస్తకం 'అబలాసచ్చరిత్ర రత్నమాల'. ఆడదానికి చదువెందుకు చాకలి పద్దు వెయ్యడం వస్తే చాలదా అనే కాలంలో కందుకూరు వీరేశలింగం పంతులుగారి వంటి సంఘ సంస్కర్తల పుణ్యమాని స్ర్తిలకు విద్యావకాశాలు లభించాయి. అలా విద్యావకాశాలు లభించిన కొద్దిమందిలో కొందరు రచనలు చెయ్యడం ప్రారంభించారు. ఆ నాడు దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్నది. తమను పట్టి పీడిస్తున్న వేశ్యావృత్తి, గృహహింస, వరకట్నం మొదలైన సమస్యలన్నిటికీ రాజకీయ స్వాతంత్య్రమే పరిష్కారమని స్ర్తిలు విశ్వసించారు. చెరసాలలో బంధనాన్ని కోరి వరించిన తల్లాప్రగడ విశ్వసుందరమ్మ / అబలలము కాము యెంతయు సబలలమయి / భారతదేశ విముక్తిని బడయు కొరకు కారాగారం అనే లంకానగరంలో ఉన్నామని కవిత రాశారు. రాయవెల్లూరు జైలులో ఉన్న ఆమె ''మాకేమి ఏ-క్లాసు జైల్లో ఉన్నాము, పాపం సి-క్లాసులో వారు ఎంత కష్టపడుతున్నారో'' అని సానుభూతి చూపించారు. రాజకీయ దాస్య విముక్తితోపాటు భావదాస్య విముక్తి కూడా కావాలని కాంచనపల్లి కనకాంబగారు హెచ్చరించారు. పరుల భాషల వ్యవహార బాధ బొరయ / కుండ నేర్చిన నంతలో నుంచవలయు / పరుల ధర్మాలపై బుద్ధిపారెనేని / హాస్య భాజనమైపోవునాంధ్రజాతి. ఇతరుల భాషనూ, వ్యవహారాన్నీ నేర్చుకోవడంలో తప్పులేదు కానీ మనస్సు వాటి మీదకు పోరాదన్న హెచ్చరిక చెయ్యడంలో కనకాంబగారు నేటి మమీడాడీ కల్చర్‌ని నాడే ఊహించగలిగారా అని అన్పిస్తుంది. ప్రేమిస్తున్నానే అబ్బాయిని సూటిగా ప్రేమ విషయమై అమ్మాయిలు ఎలా ప్రశ్నించాలో స్థానాపతి రుక్మిణమ్మగారు 'ప్రేమ' అనే పద్యాల తోరణం ద్వారా నేర్పించారు. స్ర్తిల సమస్యలు అని నేడు అంటున్న వరకట్నం, గృహహింస, లైంగిక వేధింపులు వంటి వాటికే పరిమితం కాకుండా కనుపర్తి వరలక్ష్మమ్మగారు రాజభాషగా హిందీ, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం, స్వదేశీ పరిశ్రమలు, రాజకీయాలలో అవినీతి వంటి ఎన్నో విషయాల మీద వ్యాసాలు రాశారు. పురుషాధిక్యతను ప్రశ్నించే ముందు సాటి స్ర్తికి అన్యాయం చెయ్యరాదని వరలక్ష్మమ్మగారు ఉద్బోధించారు. ప్రకాశం పంతులుగారిని దింపడానికి పన్నిన కుట్రల గురించి ఆమె అంత బాగా విశే్లషించినవారు చాలా తక్కువ. ఆమె అంతగా అన్ని విషయాలనూ అన్ని కోణాలలోనూ పరిశీలించి రచన చేసిన రచయిత్రి మరొకరు లేరేమో. 1947లో దేశానికి రాజకీయ స్వాతంత్య్రం లభించింది. స్ర్తిలకు విద్యావకాశాలు చాలా మెరుగయ్యాయి. బాలికలకై ప్రత్యేక పాఠశాలలు, ఉచిత విద్యాసౌకర్యం మాత్రమే కాక అనేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం కల్పించింది. గ్రామాలలో ఏడవ తరగతిలో ఉత్తీర్ణులైన బాలికలకు 1950లలో ముప్ఫై రూపాయలు (కిలోబియ్యం అర్థ రూపాయ ఉండే కాలం) ఇచ్చేవారంటే అతివల చదువు ఎంత సులభసాధ్యమయిందో గ్రహించవచ్చు. చదువుకునే అవకాశాలు పెరగడంతో రచయిత్రుల సంఖ్యా, పాఠకురాళ్ళ సంఖ్యా పెరిగింది. పత్రికలు కూడా స్ర్తిల రచనలను ఎంతగా ప్రోత్సహించేవంటే మగవారైనా ఆడ పేరుతో పంపితే కానీ ప్రచురణ జరగదన్న నమ్మకం జనబాహుళ్యంలో ఉండేది. రాశి పెరిగింది సరే వాసి ఎంతవరకూ పెరిగింది? ఏదైనా సులభసాధ్యమైనప్పుడు దాని విలువ గుర్తింపబడదని అంటారు. గత శతాబ్ది ఆరంభంలో మహిళలకు విద్య కష్టసాధ్యం. ఆ కారణంగానేనేమో వారు కష్టపడి అన్ని విషయాలనూ నేర్చుకుని రచనలు చేశారు. చదువుకోడం సులభమయ్యాక రచనలు కూడా సులభంగానే చేసెయ్యచ్చునన్న భావం మహిళలలో బయలుదేరి ఉండవచ్చు. విషయ పరిగ్రహణను చాలామటుకు వదిలిపెట్టేశారు. స్వాతంత్య్రానంతర మహిళా రచనలలో రెండు రకాల కథలూ, నవలలూ ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. మొదటి ప్రేమాంశంతో కూడుకున్నవి. సందు తిరగని కార్లూ, ఉంగరాల జుట్టూ, ఎతె్తైన భుజాలూ వగైరాలతో హీరోలూ, బుగ్గల్లోకి ఆవిర్లొచ్చే హీరోయిన్లూ వగైరాలుంటాయి. గుంటూరులో సమద్రముందన్నా, హీరోయిన్ మనస్సు మార్చుకునేసరికి హీరో వెడుతున్న విదేశీ విమానాన్ని వెనక్కి రప్పించేశారన్నా ఫరవాలేదు. రచయిత్రులకే తెలియదో, పాఠకురాళ్ళకి తెలియదన్న ధైర్యమో. రెండవది కుటుంబ ప్రాధాన్యమైన కథలు. అత్తగార్లూ, కోడళ్ళూ, ఆడపడుచులూ, ఇళ్ళళ్ళో ఉండే పొరపొచ్చాలూ, ఆర్థికపరమైన ఇబ్బందులూ, మధ్యలో ప్రేమలూ, ప్రేమించి ఒక పెళ్ళి, పెద్దలకోసం ఒక పెళ్ళి చేసుకునే మగవారూ, కుల పట్టింపులూ, వగైరాలుంటాయి. మన చుట్టూ ఉన్న పాతిక, ముప్ఫై కుటుంబాల విషయాల గురించి తప్ప పట్టించుకోకపోవడం ఏ రచయిత అయినా చెయ్యవచ్చునా? 1980ల తర్వాత స్ర్తివాద రచనలనేవి ప్రారంభమయ్యాయి. మగవారంతా దుష్టులు, పురుషాధిక్య సమాజం నశించాలి, స్ర్తిలకు సమాన హక్కులు కేంద్రంగా ఈ రచనలు సాగుతాయి. ఈ మూడు రకాల రచనలలో వేటిని గమనించినా ఒక్క విషయం స్పష్టంగా కన్పిస్తుంది. విశాల దృష్టి లోపించి సంకుచితంగా ఆలోచించడం మొదలైంది. స్ర్తిల సమస్యలంటే ఆర్థిక స్వేచ్ఛ, (స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సమానార్థకాలు కావు) కోరినవాణ్ణి వరించడం, మంచి జీతాలున్న ఉద్యోగినులకు ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఉండే హక్కులు, ఎవరి మాటనైనా వినడమంటే బానిసత్వంగా భావించడం వగైరాలుగానే రచయిత్రులలో చాలామంది భావిస్తున్నట్లుగా కన్పిస్తుంది. ఇంట్లో దీపావళి పండుగనాడు తినడానికి బెల్లంముక్క తప్ప ఏమీ లేకపోయినా స్థిరంగా నిలబడగలిగిన నాయిక నైతికబలం నేడు కలికానికైనా కన్పించదేమి? ఇదంతా రచయిత్రులందరూ, ప్రేమకథలకూ, కుటుంబ సమస్యలకూ, స్ర్తివాదానికీ మాత్రమే పరిమితమయ్యారని చెప్పడానికి కాదు. తొలి నాటి రచయిత్రులకూ, నేటి రచయిత్రులకూ తేడా ఎక్కువ ఉంది. కార్మికుల గురించి బీనాదేవి రాసిన 'హాంగ్‌మక్విక్'', నక్సలిజంపై వాసిరెడ్డి సీతాదేవి రాసిన 'మరీచిక', మల్లాది వసుంధర రాసిన చారిత్రక నవల 'తంజావూరు పతనం' వంటి రచనలు ఉన్నాయి. కానీ చాలామంది రచయిత్రులు తమ పుస్తకాలను చిన్న పరిధికే పరిమితం చేస్తున్నారు. అన్ని విషయాలనూ అధ్యయనం చేసి, అన్ని కోణాలలో పరిశీలించి రచయత్రులు రచనలు చెయ్యడం అతివల అభ్యుదయానికి అసలైన మార్గం.

No comments:

Post a Comment